Madnapalle: ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన తనయుడు

Son killed father over rift in Madanapalle
  • అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘటన
  • ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ. 16 లక్షల అప్పు చేసిన కుమారుడు
  • వాటిని తీర్చేందుకు ఆస్తిలో వాటా కోసం పట్టు
  • నిరాకరించిన తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య
ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై పగ పెంచుకున్న కుమారుడు ఆయనను కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గతరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. 

రఘునాథరెడ్డి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ దాదాపు రూ. 16 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. దీంతో కొన్నేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

గతరాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు తండ్రి ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయిన రఘునాథరెడ్డి వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. ఆపై బెంగళూరులో ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విషయాన్ని బంధువులతోపాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాతంత్రా చిన్నరెడ్డప్ప కోసం గాలించారు. ఈ ఉదయం వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రఘునాథరెడ్డిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Madnapalle
Crime News
Andhra Pradesh

More Telugu News