KTR: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ: కేటీఆర్

Revanth and Modi are same says KTR
  • మోదీ, రేవంత్ ఇద్దరూ ఒకటే అన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మండిపాటు
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారికి వారే ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పార్టీగా కాంగ్రెస్ అభివర్ణించిందని... ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారని... ఇక్కడ మీరు చేస్తున్నది ఏమిటని అడిగితే సమాధానం లేదని చెప్పారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. విజిలెన్స్ దాడులతో బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడే భాయ్, చోటే భాయ్ లకు తేడా లేదని... ఢిల్లీలో బడే భాయ్ మోదీ రాజ్యాంగ సంస్థలను వాడుకుంటున్నట్టే... ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని అన్నారు. 

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తమకు సానుభూతి ఉందని... ఎందుకంటే రాజకీయంగా వారికి వారే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వారిని ఎవరూ కాపాడలేరని... ప్రజలు వారిని శిక్షించడం ఖాయమని అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు... ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.
KTR
BRS
Revanth Reddy
Congress
Narendra Modi
BJP

More Telugu News