Revanth Reddy: ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

Revanth Reddy says fee reimbursement introduce by congress
  • ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని వెల్లడి
  • కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం
  • గత సీఎంల వల్ల ఐటీ, పార్మా రంగాల్లో మనం ముందున్నామన్న రేవంత్ రెడ్డి
  • కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సులు ఉండాలన్న రేవంత్ రెడ్డి
తొలిసారి పీజు రీయింబర్స్‌మెంట్ అన్నది ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్రభుత్వ విధానం తెలియాలన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం చాలా కీలకమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం అన్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

గత ముఖ్యమంత్రుల నిర్ణయాల కారణంగా మనం ఫార్మా, ఐటీ రంగాల్లో ముందున్నామని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఉండాలన్నారు. ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.

త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి అటానమస్ హోదా ఇస్తామన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీ పడేవిధంగా మనం తయారు కావాలని సూచించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News