Revanth Reddy: ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇంకా కుట్రలు చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy hot comments on BJP and BRS
  • బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపాటు
  • త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని వెల్లడి
  • పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు ఇవ్వాలని వ్యాఖ్య
  • కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందన్న రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? అని ప్రశ్న
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పడిపోవాలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే... కూలిపోతుందని కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ... త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు.

ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు ఇవ్వాలన్నారు. వారివల్లే తాము ఇక్కడ కూర్చున్నామని వ్యాఖ్యానించారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం లోపే మన ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంటే... బీఆర్ఎస్ మాత్రం కుట్రలు చేస్తోందన్నారు.

కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని... దాడులు జరిగిన సమయంలో కేసీఆర్ చెబుతున్న రాజనీతి ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తన వరకు వస్తే గానీ కేసీఆర్‌కు బాధ తెలియడం లేదన్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
Revanth Reddy
Congress
BJP
BRS

More Telugu News