Rahul Gandhi: హిందుత్వాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టలేదు.. జ్యోతిర్ మఠం శంకరాచార్య

Shankaracharya Backs Rahul Gandhi After Row Over Hindus Are Violent Remark
  • హిందుత్వాన్ని రాహుల్ తప్పుబట్టలేదని స్పష్టీకరణ
  • ఆయన ప్రసంగ వీడియోను మొత్తం తిలకించినట్లు వెల్లడి
  • హిందూ మతంలో హింసకు తావులేదని ఆయన సరిగ్గానే చెప్పారని వ్యాఖ్య
  • రాహుల్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి ప్రచారం చేసే వాళ్లను శిక్షించాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ లో ఇటీవల చేసిన ‘హిందుత్వ హింస’ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్పందించారు. ఈ విషయంలో రాహుల్ కు మద్దతు పలికారు. హిందుత్వాన్ని తప్పుబట్టేలా రాహుల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

ఈ విషయంపై విలేకరులు తాజాగా అడిగిన ప్రశ్నకు అవిముక్తేశ్వరానంద స్పందిస్తూ ‘హిందుత్వం గురించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ విన్నప్పుడు ఆయన ప్రసంగ వీడియోను మొత్తం తిలకించాను. అందులో ఆయన ఎక్కడా హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడలేదు. హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ గాంధీ సరిగ్గానే చెప్పారు.

‘రాహుల్ ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధ సత్యాలు ప్రచారం చేయడం నేరం. అలాంటి వ్యక్తులు పత్రికల వారైనా లేక చానల్ కు చెందిన వారైనా శిక్షించాలి’ అని అవిముక్తేశ్వరానంద డిమాండ్ చేశారు. 

రాహుల్ ప్రసంగంలోని ‘హింసాత్మక’ వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి చేసినవి కాదని తేల్చిచెప్పారు. దీనిపై రాహుల్ వివరణ ఇచ్చారని.. మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు రాహుల్ చెప్పారని స్వామిజీ గుర్తుచేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 2న జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించారు. బీజేపీ నేతలు దేశ ప్రజలను మతప్రాతిపదికన విభజిస్తున్నారంటూ ఆరోపించారు. ‘తమను తాము హిందువులమని చెప్పుకొనే కొందరు 24 గంటలూ హింస, ధ్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు.

అయితే రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా అధికార పార్టీ ఎంపీలు తప్పుబట్టారు. దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడే వారిగా రాహుల్ గాంధీ అభివర్ణించి అవమానించారంటూ ఆరోపించారు. దీంతో రాహుల్ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

Rahul Gandhi
Shankaracharya
Lok sabha Speech
Controversy
Jyotir Mutt
Seer
Pointiff
Swamy Avimukteswarananda

More Telugu News