Revanth Reddy: అదే జరిగితే కడపలో గల్లీగల్లీ తిరుగుతా... వైఎస్ పేరుతో వ్యాపారం చేసేవారు వారసులా?: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య

Revanth Reddy targets YS Jagan indirectly
  • కడప పార్లమెంట్‌కు ఉపఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందన్న తెలంగాణ సీఎం
  • కడపకు వచ్చి షర్మిల కోసం, కాంగ్రెస్ కోసం పని చేస్తానని హామీ
  • వైఎస్ ఆశయాలు మోసినవారే అసలైన వారసులని వ్యాఖ్య
  • సర్పంచ్ కూడా గెలవని ఏపీలో... షర్మిల బాధ్యతలు చేపట్టారని ప్రశంస
కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జరుగుతోందని... అదే జరిగితే తాను కడపకు వచ్చి ఊరూరు... గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ కోసం, షర్మిల కోసం పని చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈరోజు చాలామంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారని విమర్శించారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.

రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలనేది వైఎస్ కల అని, ఆ ఆశయం కోసం పని చేసేవారికి అండగా ఉండాలన్నారు కానీ వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవారు వారసులు అవుతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవారు వారసులా? లేక ఆయన ఆశయం కోసం పని చేసేవారా? ఆలోచించాలని సూచించారు.

కాంగ్రెస్ సర్పంచ్ కూడా గెలవదనే చోట షర్మిల పగ్గాలు చేపట్టారు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనీసం సర్పంచ్‌ను కూడా గెలుచుకోదని చెబుతారని... అది తెలిసి కూడా షర్మిల బాధ్యత తీసుకున్నారని కితాబునిచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోస ఆమె ఈ బాధ్యతలను స్వీకరించారన్నారు. అలాంటి షర్మిలకు తాము నూటికి నూరు శాతం తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఇక్కడకు తనతో పాటు తన మంత్రివర్గం అంతా వచ్చిందని... మీకు అండగా ఉంటామని చెప్పడానికే వచ్చామన్నారు. ప్రతి అడుగుకు సందర్భం వస్తుందని... ప్రజలు మున్ముందు సరైన తీర్పు ఇస్తారన్నారు.

ఊరూరు తిరిగే బాధ్యతను తీసుకుంటా

కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు వస్తే ఊరురు తిరిగే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీకి చూపించే అవకాశమొస్తే తాను గల్లీ గల్లీ... ఇల్లిల్లూ తిరుగుతానన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో... అదే కడప నుంచి మనం ముందుకు సాగుదామని ధైర్యం చెప్పారు. ఎక్కడైతే దెబ్బతిన్నామో... అదే కడప నుంచి మొదలు పెడదామన్నారు. 2009లో వైఎస్ మరణం తర్వాత షర్మిల ఓదార్పు యాత్రను ప్రారంభించి... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కోసం అలుపెరగని కృషి చేశారని కితాబునిచ్చారు.

వైఎస్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర

20 ఏళ్ల క్రితం వైఎస్ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. 1999లో వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్రను ఈరోజు రాహుల్ గాంధీ లోక్ సభలో పోషిస్తున్నారన్నారు. వైఎస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేద'ని గుర్తు చేశారు.
Revanth Reddy
YS Sharmila
YS Jagan
Andhra Pradesh

More Telugu News