Revanth Reddy: బాబు, జగన్, పవన్ కల్యాణ్ అధికార పక్షమే... ఏపీలో షర్మిలే ప్రతిపక్షం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy says Sharmila only opposition leader in AP
  • తన తండ్రి వైఎస్ స్ఫూర్తితో ఏపీలో షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని విమర్శ
  • బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చురక
  • ఏపీ ప్రజల కోసం నిలబడి కొట్లాడేవారు... ఢిల్లీలో కలబడేవారు షర్మిల మాత్రమేనని వ్యాఖ్య
  • నేను రాహుల్ గాంధీ తరఫున వచ్చానన్న రేవంత్ రెడ్డి
బాబు (చంద్రబాబు), జగన్, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురూ అధికారపక్షమేనని... బీజేపీ అంటే వీరు ముగ్గురేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏపీలో ఉన్న ప్రతిపక్షం కేవలం షర్మిల, కాంగ్రెస్ పార్టీయే అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తండ్రి వైఎస్ స్ఫూర్తితో ఏపీలో షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారన్నారు.

ఇక్కడి పరిణామాలు చూస్తుంటే 1999లో వైఎస్ ఎలాగైతే ప్రతిపక్ష పాత్ర పోషించారో ఇప్పుడు షర్మిల అదేవిధంగా కొట్లాడుతున్నారని కితాబునిచ్చారు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని... కానీ బీజేపీ అంటే మాత్రం, బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేదన్నారు. ఉన్నదంతా మోదీ పక్షమేనని విమర్శించారు. ఈ ముగ్గురు నాయకులు మోదీ వైపే ఉంటారన్నారు. అంతా అధికారపక్షమే అయినప్పుడు ఇక ప్రతిపక్షం ఎవరు? ఆ నాయకురాలు షర్మిలే అని వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రజల కోసం నిలబడి కొట్లాడేవారు... ఢిల్లీలో నిలబడి కలబడేవారు షర్మిల మాత్రమేనన్నారు. అందరూ షర్మిల నాయకత్వంలో పని చేయాలని సూచించారు. 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 2029లో దేశంలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని అవుతారని, ఏపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ పంపించారు...


వైఎస్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. వైఎస్ దూరమై 15 ఏళ్లైనా జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనకు వెళ్ళినందున... ఆయన తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనను ఆదేశించారన్నారు. ప్రజా సంక్షేమంలో వైఎస్ అరుదైన ముద్ర వేశారన్నారు.

బాగా ప్రిపేర్ అయి మండలికి వెళ్లేవాడిని

2007లో తాను ఎమ్మెల్సీగా మండలికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎంతగా చదువుతారో తనకు తెలియదు కానీ... తాను మాత్రం మండలి సమావేశాలకు వెళ్లడానికి రాత్రంతా కూడా చదివి వెళ్లేవాడినని తెలంగాణ సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాను బలమైన వాదన వినిపించేవాడినన్నారు. వైఎస్ 2009లో రెండోసారి సీఎం అయ్యారని... అప్పుడు కూడా ప్రిపేర్ అయి వెళ్ళేవాడినన్నారు. మొదటి బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం విని ఆయన తనను ప్రోత్సహించే ఉద్దేశంతో సమాధానం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. తనను ప్రోత్సహించవద్దని శైలజానాథ్ ఆరోజు వైఎస్‌కు చెవిలో చెప్పినట్లుగా అనిపించిందని.. కానీ వైఎస్ మాత్రం తనను ఉత్సాహపరిచేవిధంగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.

తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. సభానాయకుడిగా కూర్చొని గుర్తు చేసుకున్నది వైఎస్ మాట్లాడిన మాటలనే అని చెప్పారు. కొత్తగా వచ్చిన వారు అవగాహనతో మాట్లాడితే వాటిని వినాలని.. ప్రభుత్వం తరఫున సమాధానం ఇవ్వాలని వైఎస్ నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం, అభివృద్ధిపై వైఎస్ లేని లోటు తెలుస్తోందన్నారు.
Revanth Reddy
YS Sharmila
Andhra Pradesh
Telangana

More Telugu News