Beerla Ailaiah: సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి పదవి అడిగాను: ఆలేరు ఎమ్మెల్యే

Aleir MLA Yadaiah asks for minister post
  • గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరినట్లు వెల్లడి
  • నల్గొండ పరిధిలో ఇద్దరు మంత్రులు ఉన్నారని వ్యాఖ్య
  • ఏపీలో తమ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశమిచ్చారన్న ఐలయ్య
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరికి మంత్రి పదవి లేదని... కాబట్టి తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని, తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను కలిశానన్నారు.

నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారని, కానీ భువనగిరి పరిధిలో ఎవరూ లేరన్నారు. గొల్లకుర్మలు లేకుండా ఎప్పుడూ మంత్రివర్గం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా తనకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఏపీలో తమ సామాజికవర్గంలో ముగ్గురికి అవకాశమిచ్చారని, ఇక్కడ కూడా చోటు కల్పించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... ఇలా ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఇటీవల భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
Beerla Ailaiah
BRS
Congress

More Telugu News