Revanth Reddy: రాహుల్ గాంధీని వ్యతిరేకించేవారు వైఎస్ వారసులు కాదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy participated in YS Jayanthi
  • రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తన లక్ష్యమని వైఎస్ చెప్పేవారన్న సీఎం
  • రాహుల్ ని ప్రధానిగా చేయడానికి కృషి చేసేవారే వైఎస్‌కు వారసులని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ పాదయాత్రకు వైఎస్ స్ఫూర్తి అని వెల్లడి
రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కృషి చేసేవారే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు అవుతారని... యువనేత నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు ఎట్టిపరిస్థితుల్లో వైఎస్ వారసులు అనబడరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఈ రోజు దివంగత వైఎస్ 75వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తన లక్ష్యమని వైఎస్ చెప్పేవారని పేర్కొన్నారు. కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ గాంధీ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారన్నారు. రాహుల్ పాదయాత్రకు వైఎస్ చేసిన పాదయాత్ర స్ఫూర్తి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా కారణమని పేర్కొన్నారు. రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారన్నారు. ప్రధాని పదవికి ఆయన ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారని... ఆయన ప్రధాని కావడం నేటి చారిత్రక అవసరమన్నారు. అందరం కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నారు.

దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్సార్ పాలన అన్నారు. పేదల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర చాలా బలంగా ఉందని, ఆరు గ్యారెంటీలకు ఆయనే స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, వైఎస్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు 35 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామన్నారు. ఒక్కరు కూడా పైరవీకారులు లేరని, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
Revanth Reddy
Telangana
Andhra Pradesh
YS Sharmila

More Telugu News