Cupboard Bunker: కప్ బోర్డ్ లోపల టెర్రరిస్టు స్థావరం.. వీడియో ఇదిగో!

Security Forces Discover Terrorist Bunker Hidden Behind Cupboard In Kulgam
  • జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో గుర్తించిన భద్రతా బలగాలు
  • కప్ బోర్డ్ లోపల కాంక్రీట్ తో బంకర్ నిర్మాణం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో భద్రతాబలగాలు ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఎన్ కౌంటర్ల తర్వాత భద్రతాబలగాలు ఓ ఇంట్లోని కప్ బోర్డ్ లో టెర్రరిస్టులు ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరాన్ని గుర్తించాయి. ఈ బంకర్ కు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. చూడడానికి మామూలు కప్ బోర్డ్ లానే ఉన్నా లోపల మాత్రం కాంక్రీట్ తో టెర్రరిస్టులు బంకర్ ను నిర్మించుకున్నారు.

ఎన్ కౌంటర్ తర్వాత చిన్నిగామ్‌ ఫీసల్‌లోని ఓ ఇంట్లో భద్రతా బలగాలు సోదాలు చేయగా ఈ బంకర్ బయటపడింది. అందులో దాక్కుని కాల్పులు జరిపిన టెర్రరిస్టును సైన్యం అప్పటికే మట్టుబెట్టింది. కప్ బోర్డ్ లోని బట్టలను బయటకు తీసి జాగ్రత్తగా పరిశీలించగా ఓ డోర్ కనపడిందని అధికారులు తెలిపారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఇద్దరు వ్యక్తులు దాక్కునేందుకు వీలు కల్పించే బంకర్ బయటపడిందన్నారు. కాంక్రీట్ తో పటిష్ఠంగా కట్టిన ఈ బంకర్ లోకి పాక్కుంటూ వెళ్లాల్సిందే. లోపల మాత్రం నిటారుగా నిల్చునేందుకు వీలుంది.

గతంలో జమ్మూకశ్మీర్ లోని గ్రామాల్లో ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద రహస్య స్థావరాలు నిర్మించుకున్నారని సైనిక అధికారులు తెలిపారు. 2019లో లస్సీపురలోని ఓ ఇంటిలో సోదాలు జరిపినపుడు బంకర్ గుర్తించామని, అందులో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పారు. తొలుత ఆ ఇంటిని అణువణువూ తనిఖీ చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, అయితే తమకు అందిన పక్కా సమాచారంతో ఏకంగా ఆరుసార్లు సోదా చేశామన్నారు. చివరకు సెప్టిక్ ట్యాంకులో బంకర్ బయటపడిందని వివరించారు.
Cupboard Bunker
Terrorist Hideout
Kulgam
Jammu And Kashmir
Kulgam Encounter
Viral Videos

More Telugu News