Revanth Reddy: హైదరాబాద్ లోని స్థిరాస్తులు ఇవ్వడానికి తెలంగాణ నో.. ఢిల్లీలోని ఏపీ భవన్ తరహా నిర్మాణానికి స్థలం ఇస్తామన్న రేవంత్!

Revanth Reddy not ready to give Hyderabad Assets to AP
  • హైదరాబాద్‌లో భూమి కోసం అర్జీ పెట్టుకోవాలని ఏపీకి సూచించిన తెలంగాణ
  • ఐదు గ్రామాలను ఇవ్వాలని కోరిన తెలంగాణ... ఏపీ సానుకూల స్పందన?
  • విద్యుత్ బకాయిలపై ఇరు రాష్ట్రాల చర్చ
తెలంగాణ, హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను తమకు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అంటున్నారు. అవసరమైతే ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్‌లో భవనం కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. భూమి కోసం ఏపీ అర్జీ పెట్టుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు సాయంకాలం హైదరాబాదులోని ప్రజాభవన్ లో జరిగిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ముగిసింది. అయితే సమావేశంలో తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు ఉంచినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమకు రూ.24 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏపీ కోరగా... తెలంగాణ నిరాకరించిందని అంటున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని ఆస్తులను ఇచ్చేందుకు నిరాకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామాలు... ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తమకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో పదిహేను ప్రాజెక్టులు నిర్మించగా... ఇందుకు సంబంధించిన అప్పులపై, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులు, చెల్లింపులపై చర్చించారని సమాచారం. ఉద్యోగుల విభజన అంశాలపై కూడా చర్చించారు.
Revanth Reddy
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News