Teenmaar Mallanna: చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

Teenmar mallanna about Chandrababu and Revanth Reddy meeting
  • తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే ఉద్దేశంతో భేటీ జరుగుతోందని వెల్లడి
  • మిలాఖత్ అంటూ మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని విమర్శ
  • ముఖ్యమంత్రుల భేటీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని వ్యాఖ్య
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్లీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే మంచి ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చర్చలు జరపబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినప్పటికీ అందరం కలిసిమెలిసి... ఒక్కతల్లి పిల్లల్లా కలిసి ఉండాలని ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారన్నారు. అందుకే ఈ సమావేశం జరుగుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ టీడీపీతో మిలాఖత్ అయిపోయిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, అలా అనడానికి సిగ్గుండాలన్నారు. పార్టీలు వేరు... ప్రభుత్వాలు వేరు అని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు... తెలంగాణ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఆంధ్రా నుంచి మనకు రావాల్సిన వాటాలను నాడు కేసీఆర్ అడగడం మానేసి... కాంట్రాక్టుల పేరుతో తెలంగాణను అక్కడి వారికి దోచి పెట్టారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్‌కు కాంగ్రెస్ పాలన గురించి, ముఖ్యమంత్రుల భేటీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఏపీతో సత్సంబంధాలు దెబ్బతినేలా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య నిత్యం ఏదో గొడవ జరిగేలా నాడు కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. కానీ ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సదుద్దేశంతో కలుస్తున్నారన్నారు. 

నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుక్కలు చించిన విస్తరాకులా మార్చారని ఆరోపించారు. పదేళ్ల పాటు కేసీఆర్ అన్ని సమస్యలను జటిలం చేశారన్నారు. ఆయన చేసిన పాపాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి కడగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ప్రగతి భవన్‌కు వచ్చినప్పుడు లేదా కేసీఆర్ ఏపీకి వెళ్లినప్పుడు... వారు మాట్లాడుకున్న విషయం బయటకు తెలిసిందా? అని ప్రశ్నించారు. వారు గొంగడి కప్పుకొని మాట్లాడారని ఎద్దేవా చేశారు.
Teenmaar Mallanna
Congress
Revanth Reddy
Chandrababu

More Telugu News