MS Dhoni: తెలుగు ఫ్యాన్స్ అభిమానం.. ధోనీ బ‌ర్త్‌డేకు 100 అడుగుల కటౌట్‌..!

100 ft Cut Out For MS Dhoni On Her 43rd Birthday Telugu Fans Pour In Love
  • రేపు ధోనీ 43వ పుట్టినరోజు
  • దేశవ్యాప్తంగా బ‌ర్త్‌డే వేడుకల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఫ్యాన్స్‌
  • మ‌హీపై త‌మ అభిమానం చాటుకున్న తెలుగు అభిమానులు
భార‌త‌ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీది రేపు (ఆదివారం) 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహీ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా సెల‌బ్రేట్‌ చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ధోనీపై తెలుగు ఫ్యాన్స్‌ త‌మ అభిమానం చాటుకున్నారు. ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా 100 అడుగుల ఎంఎస్‌డీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. కాగా, ఈ భారీ క‌టౌట్‌ కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట స‌మీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీని తాలూకు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన అభిమానులు ధోనీకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక మ‌హేంద్రుడి సార‌థ్యంలో భార‌త్ 2007లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన విష‌యం తెలిసిందే. అలాగే టీమిండియాకు టెస్టుల్లో నం.01 ర్యాంక్ కూడా అందించాడు ధోనీ. 

ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌ కెరీర్ ఇలా.. 
90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోనీ ప్రతి ఫార్మాట్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. టెస్టుల్లో 4,876 పరుగులు, వన్డేల్లో 10,773, టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. అటు కీప‌ర్‌గాను రాణించి ఎన్నో రికార్డులు కొల్ల‌గొట్టాడు. మొత్తానికి ధోనీ ఓ అద్భుతమైన క్రికెట‌ర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లోనూ మహీ మార్క్‌..
264 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,243 పరుగులు చేసిన ధోనీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా కొన‌సాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తో ఎంఎస్‌డీ రిటైర్ అవుతార‌ని క‌థ‌నాలు వెలువ‌డినప్ప‌టికీ దీనిపై ధోనీ స్పందించ‌లేదు. సో.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ బ‌రిలోకి దిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.
MS Dhoni
Telugu Fans
Birthday
Cricket
Team India
Sports News

More Telugu News