Revanth Reddy: టిక్కెట్ రేట్లు పెంచాలంటే... తెలుగు చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి షరతు

Revanth Reddy condition to Tollywood
  • సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సూచన
  • వీడియోలను థియేటర్‌లలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి
  • సినిమాలోని స్టార్స్‌తో వీడియోను రూపొందించాలని సూచన
తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షరతు విధించారు! టిక్కెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వచ్చేవారు మొదట సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ... సినిమా పరిశ్రమకు తాను ఓ సూచన చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ రేట్ల పెంపుకు జీవోల కోసం ప్రభుత్వాల వద్దకు వస్తుంటారని... కానీ సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నియంత్రణలో మీ వంతు బాధ్యత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అందుకే అధికారులకు ఓ సూచన చేస్తున్నానని... టిక్కెట్ రేట్ల పెంపు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే... వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియోను చేయాలన్న షరతు పెట్టాలన్నారు.

మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియోను రూపొందించాలని సూచించారు. ఈ షరతు కచ్చితంగా పాటించాలన్నారు. చిత్ర పరిశ్రమలో ఎంత పెద్దవాళ్లు వచ్చి అడిగినా... వీడియోతో వస్తేనే రాయితీలు, ఇతర వెసులుబాటు ఉంటుందన్నారు. సమాజం నుంచి చిత్ర పరిశ్రమ వాళ్లు ఎంతో తీసుకుంటున్నారని.. వాళ్లు కూడా కొంత ఇవ్వాలని సూచించారు. సమాజాన్ని కాపాడే బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందని గుర్తించాలన్నారు. సినిమా షూటింగ్‌  అనుమతి కోసం వచ్చినప్పుడే పోలీసులు ఈ సూచన చేయాలన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌పై చిరంజీవి వీడియోతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Revanth Reddy
Congress
Tollywood
Telangana

More Telugu News