Harish Rao: రాహుల్ గాంధీని అశోక్ నగర్ పిలిపించి ఇప్పించిన హామీ ఏమైంది?: హరీశ్ రావు

Harish Rao questions Revanth Reddy on unemployment
  • గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నేత మోతీలాల్ నాయక్
  • పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీకి రాహుల్ గాంధీ మాటిచ్చారన్న హరీశ్ రావు
  • ఎందుకు మాట నిలబెట్టుకోలేదని నిలదీసిన వైనం
నిరుద్యోగుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ను పరామర్శించిన సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 

నాడు రాహుల్ గాంధీని అశోక్ నగర్ పిలిపించి మరీ ఇప్పించిన హామీ ఏమైందని రేవంత్ ను ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఇప్పుడా మాట ఏమైందని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"జీవో నెం.46 రద్దు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. మెగా డీఎస్సీ వేయలేదు. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలి. రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలి" అని డిమాండ్ చేశారు. 

మోతీలాల్ నాయక్ గత  వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ది కపటప్రేమ అని ధ్వజమెత్తారు.
Harish Rao
Revanth Reddy
Unemployment
BRS
Congress
Telangana

More Telugu News