Virat Kohli: ఇంటికి వీడియో కాల్ చేసి ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో ఇదిగో

Virat Kohli was on a video call probably with his wife Anushka Sharma and his kids and this is when he broke down
  • ఇదే చివరి వరల్డ్ కప్ అని ప్రకటించిన విరాట్ కోహ్లీ
  • భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచాక భావోద్వేగం
  • కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎమోషనల్ అయిన విరాట్
టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దాదాపు ఆటగాళ్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద బాష్పాలు కార్చారు. ఇక పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో 76 పరుగులు బాది టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన విరాట్.. ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించాడు. అనంతరం మైదానంలో బాగా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు చెమర్చాడు. అంతేకాదు వీడియో కాల్ చేసి ఏడ్చేశాడు. ఈ వీడియో కాల్ లో భార్య అనుష్క శర్మ, పిల్లలతో మాట్లాడి ఉంటాడని భావిస్తున్నారు.

వీడియో కాల్ చేసిన వెంటనే విరాట్ కన్నీళ్లు పెట్టాడు. అయితే కొద్ది క్షణాల్లో భావోద్వేగాన్ని అణుచుకొని పిల్లలను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. 59 బంతుల్లో 76 పరుగులు బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

కాగా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ఫైనల్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ప్రకటించాడు. తాము అనుకున్నది సాధించామని అన్నాడు. ఇక పరిగెత్తలేమని ఏదో ఒక రోజు అనిపిస్తుందని, తన విషయంలో అదే జరిగిందని, దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అంటూ విరాట్ వ్యాఖ్యానించాడు. ఇదే తగిన సందర్భం అని, ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి ఉండదని అన్నాడు. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ గెలవకపోయుంటే ఈ నిర్ణయం ప్రకటించకపోయేవాడినేమో అని విరాట్ పేర్కొన్నాడు.

తదుపరి తరం యువ ఆటగాళ్లకు ఇక అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, యువ క్రికెటర్లు భారత జాతీయ పతాకం రెపరెపలాడించి, జట్టును ఇక్కడి నుంచి మరింత ముందుకు తీసుకెళ్తారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Virat Kohli
Team India
India win T20 World Cup
T20 World Cup 2024
Cricket

More Telugu News