Rohit Sharma: ఒకే రోజు ఒకే సమయంలో కోహ్లీ, రోహిత్‌శర్మ సంచలన నిర్ణయాలు.. టీ20 క్రికెట్‌కు గుడ్‌బై

Virat Kohli and Rohit Sharma announces retirements from T20 cricket
  • చివరి మ్యాచ్ ఆడేశామన్న కోహ్లీ, రోహిత్
  • తర్వాతి తరానికి చోటివ్వాలన్న ఉద్దేశంతోనేనన్న కింగ్ కోహ్లీ
  • ఏం కోరుకున్నామో అది సాధించామన్న విరాట్
  • టీ20లకు వీడ్కోలు  తీసుకునేందుకు ఇదే సరైన సమయమని భావించానన్న రోహిత్
  • రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్న కెప్టెన్
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన భారత స్టార్ ఆటగాడు రోహిత్‌శర్మ, మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఇద్దరూ ఒకే రోజు తీసుకున్న నిర్ణయాలు భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో భారత్ విజయానికి బాటలు వేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాతి తరానికి చోటివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ అని, మేం ఏం కోరుకున్నామో అది సాధించామని పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టు చెప్పాడు. రోహిత్ 9 ప్రపంచకప్‌లు ఆడాడని, తాను ఆరు ఆడానని పేర్కొన్నాడు. కోహ్లీ తన కెరియర్‌లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 4,188 పరుగులు చేశాడు.

ఇదే మంచి సందర్భం
కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్‌శర్మ కూడా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించాడు. బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంతకుమించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 37 ఏళ్ల   రోహిత్‌శర్మ 159 మ్యాచ్‌లు ఆడి 4,231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Rohit Sharma
Virat Kohli
Team India
Kohli Retirement
Rohit Retirement
T20 World Cup 2024 Final

More Telugu News