Varalaxmi Sarath Kumar: ప్రధాని నరేంద్ర మోదీని రిసెప్షన్ కు ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్... ఫొటోలు ఇవిగో!

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ముంబయికి చెందిన ఆంట్రప్రెన్యూర్, ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికొలాయ్ సచ్ దేవ్ తో ఆమె వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. 

తాజాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పెళ్లి కార్డు అందించారు. తన వివాహ రిసెప్షన్ కు తప్పక రావాలంటూ ఆహ్వానించారు. వరలక్ష్మితో పాటు ఆమె తండ్రి శరత్ కుమార్, రాధిక, నికోలాయ్ సచ్ దేవ్ కూడా పీఎంవోకు వచ్చి మోదీని కలిశారు. దీనిపై వరలక్ష్మి ఎక్స్ ద్వారా స్పందించారు. 

"మన గౌరవనీయ ప్రధాని మోదీ గారిని కలవడం ఎంతటి గొప్ప అవకాశం! ఆయనను మా వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానించాం. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించిందుకు, ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మా కోసం సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం సర్. థాంక్యూ డాడీ... ప్రధాని మోదీని కలిసే అవకాశం నీ వల్లే సాధ్యమైంది" అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రధానిని కలిసినప్పటి ఫొటోలు కూడా పంచుకున్నారు.
Varalaxmi Sarath Kumar
Narendra Modi
Wedding Reception
Invitation
Kollywood

More Telugu News