C.Ramachandraiah: అజ్ఞానాన్ని బయటపెట్టుకుని నవ్వులపాలు కావడం జగన్‌కు అలవాటైపోయింది: సి.రామచంద్రయ్య

TDP MLC C Ramachandraiah Slams Jagan On His Letter To Speaker
  • ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ లేఖపై సి.రామచంద్రయ్య ఫైర్
  • లేఖలోని పలు అంశాలను తప్పుబట్టిన టీడీపీ నేత  
  • ప్రతిపక్ష హోదా లేకుంటే ప్రజా సమస్యలపై స్పందించరా? అని ప్రశ్న
  • లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్న
  • రూల్ ఆఫ్ లా అన్నది జగన్ డిక్షనరీలోనే లేదని ఆగ్రహం
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ శాసనసభాపతికి జగన్ రాసిన లేఖపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుత వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండందంటూ నిండు సభలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను వైరల్ చేస్తున్నారు. 

తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత సి.రామచంద్రయ్య స్పందిస్తూ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఆ హోదా లేకుంటే ప్రజా సమస్యలపై చర్చించరా? అని నిలదీశారు. అజ్ఞానాన్ని బయటపెట్టుకుని నవ్వులపాలు కావడం జగన్‌కు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జగన్ రాసిన లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ తూర్పారబట్టారు.

రామచంద్రయ్య లేవనెత్తిన అంశాలు ఇవే 

11 సీట్లు మాత్రమే పొందిన జగన్‌కు ప్రధాన ప్రతిపక్షహోదా కావాలట. అది ఉంటేనే ప్రజా సమస్యల్ని సమర్థవంతంగా సభలో వినిపిస్తారట.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో జగన్ ఓ వింత వాదన, అసంబద్ధమైన వాదన చేశారు. 
అందులో మొదటిది - తనను ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించకుండా, మంత్రుల తర్వాత ప్రమాణం చేయించడం అప్రజాస్వామికం అట. 
జగన్ ముందు తనను తన పార్టీ శాసనసభ్యులు 10 మంది కలిసి నాయకుడిగా ఎన్నుకొన్నట్టు ప్రొటెం స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి కదా? ఆ లేఖ ఇవ్వనప్పుడు మిమ్మల్ని వైఎస్సాఆర్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడని ప్రొటెం స్పీకర్ ఎలా గుర్తిస్తారు? 
మీరు అధికారికంగా లేఖ ఇవ్వనప్పటికీ గతంలో మీరు సీఎం పదవి నిర్వహించారు కనుక మిమ్మల్ని మంత్రుల తర్వాత పిలిచారు. 
నిజానికి, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన గౌరవం అది. 
రెండోది - ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన లేదు అని పేర్కొన్నారు. 
కానీ, 10 శాతం సీట్లు రాకున్నా ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాలనే రూల్ కానీ, నిబంధన గానీ ఉన్నదా? ఉంటే దానిని ఎందుకు మీరు మీ లేఖలో ఉదహరించలేదు? 
మూడోది- స్పీకర్ మిమ్మల్ని దుర్భాషలాడారన్నారు. స్పీకర్ కాకముందు ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల్ని, స్పీకర్ అయిన తర్వాత చేసినట్టుగా మాట్లాడడం వాస్తవాల్ని వక్రీకరించినట్టే. 
జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నియమాలు పాటించి ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ఉంటే ఇపుడు వాటినే అనుసరించేవాళ్లం. 
ఆయన ఎన్నడూ ప్రజాస్వామ్య సూత్రాలను పాటించలేదు. రూల్స్ ఆఫ్ లా అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. 
జగన్‌కు నిజంగా ప్రజల సమస్యలను సభలో సమర్థవంతంగా లేవనెత్తాలంటే ఎక్కడ, ఏవిధంగా కూర్చున్నాం అన్నది ముఖ్యం కాదు. గతంలో కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు ఎటువంటి హెూదా లేకున్నా సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నిర్వహించి ఉత్తమ పార్లమెంటేరియన్లుగా గుర్తింపు పొందారు. 
బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పగలరా? 
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో తలపడి ఓడిపోయిన జగన్ తమ ముగ్గురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. కారణం చెప్పగలరా? 
మీరు బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకం అయినపుడు తటస్థంగా ఎందుకు ఉండడం లేదు. ప్రజలకు వివరణ ఇవ్వాలి. 
పార్టీని ప్రైవేటు లిమిటెడ్‌గా నటపడం వల్లనే ఓటమి ఎదురయిందని గుర్తించకుండా ఇంకా ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నారు. 
దీనిని అజ్ఞానం అనాలా? దురంహకారం అనాలా? చెప్పండి జగన్‌రెడ్డీ! 

C.Ramachandraiah
Telugudesam
YSRCP
YS Jagan

More Telugu News