Mayawati: తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

BSP Supremo Mayawati announced nephew Akash Anand as her political heir

  • ఎన్నికల ముందు ఆకాశ్ ఆనంద్ ను రాజకీయ వారసుడి హోదా నుంచి తప్పించిన మాయావతి
  • అతడు ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని నాడు వ్యాఖ్యలు
  • లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క స్థానం కూడా దక్కని వైనం
  • మళ్లీ మేనల్లుడికి పార్టీలో పట్టం కట్టిన బీఎస్పీ అధినేత్రి
  • బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియామకం

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్ తాజాగా బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మాయావతి వారసుడిగా ఆకాశ్ ఆనంద్ ఎంపిక వివరాలను బీఎస్పీ నేత సర్వర్ మాలిక్ వెల్లడించారు. 

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో, పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయవాతి నేడు లక్నోలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశ్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు, అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను మాయావతి తన రాజకీయ వారసుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఓసారి అధికారికంగా ప్రకటించారు. 

అయితే, ఇటీవల ఎన్నికల ముందు అతడిని రెండు హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను, కాన్షీరామ్ కలిసి పార్టీని ఏర్పాటు చేసి, అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. 

ఈ దిశగా పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను తన రాజకీయ వారసుడి హోదా నుంచి, పార్టీ  జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పిస్తున్నానని ప్రకటన చేశారు. అతడు పరిణతి సాధించే వరకు ఈ ప్రకటన వర్తిస్తుందని ఆమె వెల్లడించారు. 

రెండు వర్గాల మధ్య విద్వేషం పెంపొందిస్తున్నాడన్న ఆరోపణలతో పాటు, పలు ఇతర అభియోగాలతో ఆకాశ్ ఆనంద్ పై ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాంతో అతడిపై వేటు వేస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు. 

ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలో దించింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో... రెండు హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే, మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు.

Mayawati
Akash Anand
Nephew
Political Heir
BSP
Uttar Pradesh
India
  • Loading...

More Telugu News