AP Assembly Session: తొలుత చంద్రబాబు.. మంత్రుల తర్వాత జగన్.. శాసనసభలో ప్రమాణ స్వీకారం

YS Jagan Swears After Chandrababu And Ministers Swearing In Assembly
  • సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • ‘జనగణమన’ గేయంతో సభ ప్రారంభం
  • చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
  • ముభావంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
  • జగన్ తర్వాత ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్.. చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. గౌరవ సభకు స్వాగతం’ అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవసాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. 

తొలుత చంద్రబాబునాయుడు తర్వాత జనసేన చీఫ్, డిప్యూట్ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎస్. సవిత, డోలా బాలవీరాంజనేయస్వామి, శ్రీనివాస్ కొండపల్లి, వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు. 

మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముభావంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం ముందు వరకు కోలాహలంగా కనిపించిన సభ.. జగన్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది.
AP Assembly Session
Chandrababu
YS Jagan
Andhra Pradesh

More Telugu News