Medchal Malkajgiri District: మేడ్చల్ నగల దుకాణంలో చోరీకి యత్నం.. గాయపడినా చాకచక్యంగా వ్యవహరించిన యజమాని!

Theives try to steal from jewellry shop in medchal
  • మేడ్చల్‌లో పట్టపగలు నగల దుకాణంలో చోరీ
  • బైక్‌పై వచ్చి చోరీకి యత్నించిన దుండగులు, కత్తితో దాడిలో యజమానికి గాయం
  • దొంగల నుంచి చాకచక్యంగా తప్పించుకుని సాయం కోసం యజమాని ఆర్తనాదాలు
  • భయపడ్డ దొంగలు నగలు చేజారినా పట్టించుకోక బైక్‌పై పారిపోయిన వైనం
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
మేడ్చల్‌లోని ఓ నగల దుకాణంలో దొంగలు పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. బురఖా ధరించిన ఓ దొంగ కత్తితో షాపు యజమానిపై దాడి చేశాడు. గురువారం మధ్యాహ్నం మేడ్చల్ ఠాణాకు కూతవేటు దూరంలో ఈ చోరీ జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, శ్రీజగదాంబ జువెలర్స్ దుకాణంలోకి బైక్‌‌పై ఇద్దరు దొంగలు వచ్చారు. వారిలో ఒకరు బురఖా ధరించగా మరో దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు. బురఖా ధరించిన వ్యక్తి షాపు యజమాని శేషారాంను బెదిరించి ఆపై కత్తితో ఛాతిలో పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలోని వెండి ఆభరణాలు, నగదును జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేశ్ భయపడి లోపలికి పారిపోయాడు. 

బంగారు ఆభరణాలు, నగదును బ్యాగులో వేయాలని దుండగులు యజమానిని బెదిరించారు. గాయపడిన శేషారం.. మీరే తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరినీ నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి..చోర్ చోర్ అంటూ కేకలు వేశాడు. భయపడిన దొంగలు బయటకు పరుగుతీసి బైక్‌పై వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనకనుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పినా వాళ్లు మళ్లీ తేరుకుని పారిపోయారు. వారి చేతిలోని నగదు, నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సీఐ సత్యనారాయణతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Medchal Malkajgiri District
Jewellry Theft
Telangana

More Telugu News