Rahul Gandhi: మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపారని చెబుతారు... కానీ పేపర్ లీకేజీని ఆపలేకపోతున్నారు: రాహుల్ గాంధీ

Modi has not been able to stop or doesnt want to stop paper leaks in India
  • విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న రాహుల్ 
  • విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపణ
  • నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని చెబుతుంటారని... కానీ పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ... పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు.

ఇప్పటికే ఒక పరీక్షను క్యాన్సిల్ చేశారని... ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యే అన్నారు.

బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు.
Rahul Gandhi
Congress
BJP

More Telugu News