Jagan: న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు: జగన్

Jagan held YSRCP cadre meeting
  • వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగన్
  • నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం
  • ఎంతో మంచి చేసినా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని వ్యాఖ్యలు 
  • శకుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికీ సంక్షేమాన్ని అందించాం... అయినా ఓడిపోయాం... ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి... ఈ ఫలితాలు శకుని మాయా పాచికలను గుర్తుకు తెచ్చాయి.... ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయా పాచికల మాదిరిగా ఉన్నాయి.. కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలం? అని జగన్ విచారం వ్యక్తం చేశారు. 

ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తొలగించండి... న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు, ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది, ప్రతి ఇంటికీ మనం ధైర్యంగా వెళ్లగలం అని జగన్ స్పష్టం చేశారు. 

2019తో పోల్చితే ఈ ఎన్నికల్లో వైసీపీకి 10 శాతం ఓట్లు తగ్గాయని, ఆ 10 శాతం ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని అన్నారు. కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం వ్యక్తమవుతుందని, 2029 నాటికి ప్రజలే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 

"అసెంబ్లీలో మన బలం తక్కువ. కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనం ప్రజలకు చేరువ అవుదాం. నాకు వయసుతో పాటు సత్తువ కూడా ఉంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు నేను మరింతగా పోరాడగలను. ప్రజాపోరాటాల్లో వైసీపీకి, ఈ జగన్ కు ఎవరూ సాటిరారు. 

చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయి. ఇకపై ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చేద్దాం. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తాను. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతాను. 

గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కార్యకర్తల వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు. కార్యకర్తలే మన బలం. వారు కష్టాల్లోనూ మనతోనే ఉన్నారు. వైసీపీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తను మనం కాపాడుకోవాలి" అని జగన్ పిలుపునిచ్చారు. 

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మనకు బలం ఉంది... నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం మనకు మద్దతుగా నిలుస్తుంది... ఈ చట్టాన్ని మార్చాలనుకున్నా కోర్టులు అందుకు అంగీకరించవు... ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని జగన్ వ్యాఖ్యానించారు. 

జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి... రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు... ఇలాంటి వారికి అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. అంతేకాదు, మన కోసం నిలబడ్డ సోషల్ మీడియా కార్యకర్తలు, వాలంటీర్లకు భరోసా ఇవ్వాలి అని జగన్ స్పష్టం చేశారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News