Illicit Liquor: తమిళనాడులో కల్తీసారా కాటుకు 30 మంది బలి

As many as 30 died after consuming illicit liquor in Tamil Nadu
  • మృతుల్లో ఎక్కువమంది దినసరి కూలీలే
  • ప్యాకెట్లలో విక్రయించిన సారా తాగగానే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థత
  • మరో 100 మందికిపైగా ఆసుపత్రిలో చికిత్స 
  • ఎస్పీని సస్పెండ్ చేసి, కలెక్టర్‌ను బదిలీ చేసిన సీఎం స్టాలిన్
  • ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు
తమిళనాడులో నాటుసారా తాగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. కల్లకురిచి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి స్టాలిన్ కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జటావత్‌ను బదిలీ చేసి, ఎస్పీ సామే సింగ్ మీనాను సస్పెండ్ చేశారు. ఘటనపై సీబీ-సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.

మృతుల్లో చాలామంది దినసరి కూలీలే. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ప్యాకెట్లలో విక్రయించిన సారాను తాగిన వెంటనే బాధితులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లమంటతో అవస్థలు పడ్డారు. వెంటనే వారిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించారు.

సారాను విక్రయించే గోవిందరాజ్ (కణ్ణుకుట్టి)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. కల్తీసారా ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేశామని, సారాను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సమాజాన్ని ధ్వంసం చేసే ఇటువంటి ఘటనలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. 

మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సారాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామి రాజీనామా చేయాలని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.
Illicit Liquor
Tamil Nadu
Kallakurichi
MK Stalin

More Telugu News