Dead frog: చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప!

Dead frog was allegedly found in a packet of potato wafers In Gujarat
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో షాకింగ్ ఘటన
  • విచారణకు ఆదేశించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
  • ఇటీవల దారుణ రీతిలో వెలుగుచూస్తున్న ఆహార పదార్థాల కలుషిత ఘటనలు
దేశంలోని పలు చోట్ల వెలుగు చూస్తున్న ఆహార పదార్థాల కలుషిత ఘటనలు అసహ్యం కలిగిస్తున్నాయి. ఒకచోట ఐస్‌క్రీమ్‌ కోన్‌లో మానిషి వేలు ముక్క, మరోచోట ఐస్‌క్రీమ్‌లో జెర్రి ఘటనలను మరచిపోక ముందే మరో నివ్వెరపరిచే ఘటన వెలుగుచూసింది. తాజా ఘటనలో బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనపై మునిసిపల్ అధికారులు బుధవారం విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా నమూనాలను సేకరించనున్నామని అధికారులు తెలిపారు.

బాలాజీ వేఫర్స్ అనే కంపెనీ తయారు చేసిన క్రంచెక్స్ అనే పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిందంటూ ఒకరి నుంచి తమకు ఫిర్యాదు అందిందని జామ్‌నగర్ మునిసిపల్ అధికారులు వివరించారు. మంగళవారం సాయంత్రం ఈ చిప్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారని, ఫిర్యాదు అందగానే సంబంధింత దుకాణం వద్దకు వెళ్లామని, ప్రాథమిక విచారణలో అది కుళ్లిపోయిన కప్ప అని గుర్తించామని ఫుడ్‌ సేఫ్టీ అధికారి డీబీ పర్మార్‌ వివరించారు.

నాలుగేళ్ల వయసున్న తన మేనకోడలు మంగళవారం సాయంత్ర సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న షాక్‌కు వెళ్లి ఈ ప్యాకెట్‌ను కొనుగోలు చేసిందని పటేల్ అనే వ్యక్తి తెలిపాడు. చనిపోయిన కప్పను గుర్తించడానికి ముందు తన మేనకోడలు, తన కూతురు ఇద్దరూ కొన్ని చిప్స్ తిన్నారని వివరించాడు. కప్పను చూసిన వెంటనే ప్యాకెట్‌ను విసిరికొట్టారని, కప్ప ఉందని చెబితే తొలుత నమ్మలేదని పటేల్ పేర్కొన్నారు. బాలాజీ వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫిర్యాదు చేయగా సంతృప్తికరమైన సమాధానం రాలేదని, దీంతో బుధవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం అందించానని పటేల్ వివరించారు.

.
Dead frog
Chips Packet
Gujarat
Balaji Wafers

More Telugu News