Stock Market: భారత స్టాక్ మార్కెట్లపై గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam Adani said that India will potentially add 36 trillion dollars to its stock market capitalisation
  • 2050 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న అదానీ
  • భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ 30 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని అంచనా
  • రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ సదస్సులో గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 18 నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ మేర వృద్ధి చెందే అవకాశం ఉందని అదానీ గ్రూపు కంపెనీ అధిపతి, బిలియనీర్ గౌతమ్ అదానీ అంచనా వేశారు. 2050 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భారతీయులకు ఇంతకంటే మెరుగైన సమయం ఎప్పుడూ రాలేదని అన్నారు. ఇలాంటి వృద్ధి అవకాశాలు ఇతర ఏ దేశాలకూ లేవని అన్నారు. రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ బుధవారం నిర్వహించిన 'యాన్యువల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్'లో గౌతమ్ అదానీ పాల్గొని మాట్లాడారు.

భారత జీడీపీ తొలి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అందుకోవడానికి 58 సంవత్సరాలు పట్టిందని, తదుపరి ట్రిలియన్‌కి చేరుకోవడానికి 12 ఏళ్లు, మూడవ ట్రిలియన్‌ అందుకోవడానికి కేవలం 5 సంవత్సరాల సమయం మాత్రమే పట్టిందని గౌతమ్ అదానీ ప్రస్తావించారు.

స్టాక్ మార్కెట్ల భారీ వృద్ధి ఖాయం
భారత స్టాక్ మార్కెట్లు భారీగా వృద్ధి చెందడం ఖాయమని గౌతమ్ అదానీ అంచనా వేశారు. 2050 నాటికి ఆర్థిక వ్యవస్థ పరిణామం 30 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఈ సమయానికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాబోయే 26 ఏళ్లలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ 36 ట్రిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా మారిపోతున్నాయని, ఈ మార్పుల ప్రభావం ఒక దశాబ్దం తర్వాత కనిపిస్తుందని, అప్పుడు అందరూ ప్రశంసిస్తారని అదానీ అన్నారు.
Stock Market
Gautam Adani
Indian Economy
India

More Telugu News