Nara Lokesh: యువనేత నారా లోకేశ్‌.. త‌న మార్క్ పాల‌న‌కు భారీ ప్లానే వేశారుగా!

Nara Lokesh Master Plan
  • విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు యువనేత లోకేశ్‌ శ్రీకారం
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు 100 రోజుల యాక్షన్ ప్లాన్ 
  • బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే  పని ప్రారంభించిన మిషన్ లోకేశ్‌
యువనేత నారా లోకేశ్‌.. రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఎన్నికల్లో అప్రతిహత విజయం తర్వాత కాస్తంత రిలాక్స్ అవుదామని ఆలోచించకుండా తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రప్రజల కోసం తొలిరోజు నుంచి పని మొదలు పెట్టారు. అటు ప్రజాదర్బార్ తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మ‌రోవైపు హెచ్ఆర్‌డీ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. 

త్వరలోనే ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో భేటీ అయ్యి.. వారి ఆశలు, ఆకాంక్షల మేరకు దీర్ఘకాలంగా విద్యావ్యవస్థలో నెల‌కొన్న‌ సమస్యలకు పరిష్కారం చూపాలని సంకల్పించారు. ఇందుకోసం వినూత్నమైన ఐడియాలజీతో ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడి విద్యనందించడం తప్ప సంబంధం లేని పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదన్నది ఆయన అంతరంగం. 

పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి హయ్యర్ ఎడ్యుకేషన్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీని నియ‌మించాల‌ని చూస్తున్నారు. అలాగే  చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది యువనేత లోకేశ్ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు ఐదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తేవ‌డం, ఉద్యోగాల క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌తో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఐదేళ్లపాటు నిద్రావస్థలో ఉన్న యంత్రాంగాన్ని జాగృతం చేసి తనదైన ముద్ర వేసేందుకు మంత్రి లోకేశ్‌ సిద్ధమయ్యారు.

లోకేశ్‌ పట్టుబట్టాడంటే ఉడుంపట్టే..
ఎంత కష్టతరమైనా అనుకున్నది సాధించేవరకు వరకు నిద్రపోని మనస్తత్వం యువనేత నారా లోకేశ్‌ సొంతం. ఈ అరుదైన లక్షణంతోనే కోట్లాది మంది యువతలో ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారాయ‌న‌. 2017-19 మ‌ధ్య‌ కేవలం రెండేళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేశ్‌ పనిచేసినప్పటికీ, ఆయా శాఖల్లో గతంలో ఎవరూ సాధించనంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కిమీల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. 

గ్రామీణాభివృద్ధి మంత్రిగా లోకేశ్‌ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు 'స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను 'డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేశ్‌ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. 'కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్' అవార్డు కూడా లభించింది. 

2018 సెప్టెంబర్‌లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డ‌బ్ల్యూఈఎఫ్‌) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేశ్‌కు ఆహ్వానం లభించింది. ఆ తర్వాత డ‌బ్ల్యూఈఎఫ్‌ నెట్‌వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ (ఎన్‌జీఎఫ్‌సీ) కి నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు నారా లోకేశ్‌. 

నవీనమైన, వేగవంతమైన ఆలోచనలతో రెండేళ్లలోనే హెచ్‌సీఎల్, కాడ్యుయెంట్, పై కేర్, జోహో, టీసీఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి ఎన్నో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. తాజాగా రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌ సారథ్యంలో ఆయా రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News