FSSAI: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిన ఘటన.. చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ

FSSAI has suspended the license of an ice cream manufacturer in Pune after human finger found in ice cream cone
  • ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ
  • పూణేలోని ఐస్‌క్రీమ్ తయారీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు
  • ఇంకా పెండింగ్‌లోనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్
‘ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై దేశంలో తయారీ, నిల్వ, విక్రయాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ స్పందించింది. పూణేలోని ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంత కార్యాలయం ప్రకటించింది. పూణేలో ఐస్‌క్రీమ్ తయారీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐస్‌క్రీమ్‌ తయారీ కంపెనీ పూణేలోని ఇందాపూర్‌ ప్రాంతంలో ఉందని, కంపెనీకి సెంట్రల్ లైసెన్స్ కూడా వుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తెలిపారు.

నిర్ఘాంత పరుస్తున్న ఈ ఘటనపై తదుపరి విచారణ కోసం కంపెనీ ప్రాంగణంలో నమూనాలను సేకరించినట్టు అధికారులు తెలిపారు. ముంబై నగరంలోని కంపెనీ ప్రాంగణాన్ని కూడా తనిఖీ చేశామని, బ్యాచ్ నమూనాలను సేకరించామని వివరించారు.

కాగా ఇటీవల ముంబై నగరంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీం కోన్‌ ఆర్డర్ చేశాడు. కానీ దానిని ఓపెన్ చేసి చూడగా అందులో మనిషి వేలు ఉన్నట్టు గుర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉంది.
FSSAI
Finger In Ice Cream
Mumbai
Viral News

More Telugu News