Rishikonda Palace: రుషికొండ ప్యాలెస్ రహస్యం బట్టబయలు చేసిన గంటా

Ganta Srinivasarao reveals Rishikonda palace secret
  • నేడు మీడియా ప్రతినిధులతో కలిసి రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించిన గంటా
  • లోపల అడుగడుగునా రిచ్ నెస్
  • ఆశ్చర్యపోయిన గంటా, మీడియా ప్రతినిధులు
  • రూ.500 కోట్లతో ఈ భవనం కట్టారన్న గంటా
  • దీన్ని స్టార్ హోటల్  గా ఉపయోగించుకునే వీల్లేకుండా కట్టారని వెల్లడి
  • దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం నిర్ణయిస్తారని స్పష్టీకరణ
ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావడం, జగన్ రుషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి. కానీ, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో జగన్ అనుకున్నవేవీ జరగలేదు. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు మీడియా ప్రతినిధులతో కలిసి రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించారు. 

ఇప్పటివరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడా రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు.

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో  ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. 

గతంలో ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు కూడా ఇలాంటి రాజమహల్ లను నిర్మించకున్నారని తెలిపారు. ఈ భవనం లోపల పరిశీలిస్తే... దీన్ని హోటల్ మాదిరిగా వినిగించుకునే అవకాశం లేదని, పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉందని, ఇక్కడ్నించే సమీక్షలు చేపట్టేందుకు అనువుగా నిర్మించారని వివరించారు. ఇంత రహస్యంగా విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు? అని గంటా సూటిగా ప్రశ్నించారు. 

రుషికొండపై గతంలో టూరిజం కోసం హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏటా రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఈ రిసార్ట్స్ ను పడగొట్టి ప్యాలెస్ ను నిర్మించారని మండిపడ్డారు. ఆఖరికి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఈ విలాస భవనం నిర్మించారని విమర్శించారు. మొదట స్టార్ హోటల్ అన్నారని, ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం అన్నారని, అనంతరం టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని ఆరోపించారు. 

కొందరు దీనిపై న్యాయపోరాటం చేయగా, హైకోర్టు నిపుణుల కమిటీ వేసిందని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పలు చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగిందని కమిటీ పేర్కొందని, అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగించారని ఆరోపించారు. 

ఈ భవనం నిర్మాణ అంచనాలు కూడా చాలా గోప్యంగా ఉంచారని, నిర్మాణ కాంట్రాక్టు సైతం వైసీపీ అనుకూల వ్యక్తులకే దక్కిందని తెలిపారు. రూ.91 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పి భవన నిర్మాణం ప్రారంభించారని, ఇది 15 నెలల్లోనే పూర్తవుతుందని చెప్పారని గంటా వివరించారు. కానీ, చదును చేసే పనుల కోసమే ఏకంగా రూ.95 కోట్లు ఖర్చయిందని, ఇక్కడి పరిసరాలను రమణీయంగా తీర్చిదిద్దేందుకు మరో రూ.21 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 

ఈ పనుల గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు 20 అడుగుల బారికేడ్లు పెట్టేవారని వెల్లడించారు. కనీసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి అగ్రనేతలు సైతం రుషికొండ నిర్మాణాలు పరిశీలించే వీల్లేకుండా చేశారని తెలిపారు. 

ఇంత ఖర్చు పెట్టి కట్టిన భవనంలోకి ఆఖరికి జగన్ అడుగుపెట్టడం కాదు కదా, కంటితో చూడ్డానికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని గంటా వ్యంగ్యం ప్రదర్శించారు. తాను ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్టుగా... జగన్ ఈ భవనంలో అడుగుపెట్టకుండానే అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. 

2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్... ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా పాలన కొనసాగించాడని, దాని ఫలితమే ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారని అన్నారు. విశాఖ ప్రాంతంలో వైసీపీని ప్రజలు తుడిచిపెట్టారని, తద్వారా విశాఖ రాజధాని వద్దన్న సంకేతాలను బలంగా పంపించారని గంటా స్పష్టం చేశారు. ఈ భారీ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
Rishikonda Palace
Ganta Srinivasa Rao
Visakhapatnam
TDP
Andhra Pradesh

More Telugu News