Chandrababu: కాకినాడ మహిళ ఆరుద్రకు సీఎం చంద్రబాబు అభయహస్తం

Chandrababu assures Kakinada woman Arudra

  • గతంలో సీఎంవో వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ
  • కుమార్తెకు వైద్యం కోసం ఇల్లు అమ్ముతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణ
  • జగన్ కూడా న్యాయం చేయలేదంటూ చేయి కోసుకున్న ఆరుద్ర
  • ప్రభుత్వం మారాక నేడు అమరావతి వచ్చి సీఎం చంద్రబాబును కలిసిన వైనం

కాకినాడ జిల్లా రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర అనే మహిళ గురించి తెలిసిందే. కదల్లేని స్థితిలో వీల్ చెయిర్ కే పరిమితమైన తన కుమార్తె కోసం ఆరుద్ర పడిన తపన రాష్ట్ర ప్రజలందరినీ కలచివేసింది. తన కుమార్తెకు వైద్యం కోసం ఇల్లు అమ్ముకుంటుంటే, పోలీసులు అడ్డుపడి వేధిస్తున్నారంటూ గత ప్రభుత్వ హయాంలో ఆరుద్ర సీఎం జగన్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అక్కడ న్యాయం జరగలేదంటూ చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 

ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఆరుద్ర తన కుమార్తె సాయి లక్ష్మీచంద్ర సహా నేడు అమరావతి వచ్చారు. తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలుసుకున్న చంద్రబాబు ఆమెను సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. 

ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మీచంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. 

అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం... ఆమె కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు తక్షణమే రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. 

చంద్రబాబు స్పందించిన తీరు పట్ల ఆరుద్ర సంతోషంతో పొంగిపోయారు. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని... ఇప్పుడు ఆయన భరోసా ఇచ్చాక ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 

గతంలో తన సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా, వారు స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని... పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ధైర్యంగా ఉండాలని, ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Chandrababu
Arudra
Daughter
Kakinada
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News