T20 World Cup 2024: సూపర్-8కు విండీస్.. కివీస్ ఖేల్ ఖతం!

New Zealand on brink of exit after T20 World Cup defeat by West Indies
  • ట్రినిడాడ్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌
  • 13 పరుగుల తేడాతో ఆతిథ్య విండీస్ విజయం 
  • హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లిన కరేబియన్ జట్టు     
  • రెండు వరుస ఓటములతో న్యూజిలాండ్‌ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టం
2024 టీ20 వరల్డ్ కప్ లో ఆతిథ్య వెస్టిండీస్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన కరేబియన్లు హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో గ్రూప్‌-సీ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన మొదటి జట్టుగా విండీస్ నిలిచింది. ఇక ఓటమిని చవిచూసిన కివీస్ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. 

సాధారణంగా ఐసీసీ ఈవెంట్ లలో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. కానీ ఈసారి టీ20 ప్రపంచ కప్ లో మాత్రం తేలిపోయింది. మొదటి మ్యాచ్‌ లో ఆఫ్గనిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇవాళ్టి కీలకమైన రెండో మ్యాచులోనూ ఓటమిని చూసింది. ఆతిథ్య వెస్టిండీస్‌ పై పరాజయాన్ని అందుకుంది. అలా వరుసగా రెండు ఓటములతో సూపర్-8 అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది.

గురువారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ కు దిగిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ అద్భుతమైన అర్ధ శతకం (39 బంతుల్లో 68) తో  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగితా విండీస్ బ్యాటర్లు అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 3 వికెట్లు, సౌథీ, ఫెర్గూసన్‌ తలో రెండు వికెట్లు, నీషమ్‌, శాంట్నర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 150 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కివీస్‌ 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ కే పరిమితమైంది. దీంతో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ జట్టులో గ్లెన్‌ ఫిలిప్స్ (40), ఫిన్‌ అలెన్ (26),మిచెల్ సాంట్నర్ (21 నాటౌట్) పోరాడినా ఓటమి తప్పలేదు. అల్జారీ జోసెఫ్‌ (4/19), మోతీ (3/25) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ ను అడ్డుకున్నారు.

ప్రస్తుతం గ్రూప్-సీలో వెస్టిండీస్ 3 మ్యాచుల్లో 6 పాయింట్లు(+2.596 నెట్‌ రన్‌ రేట్‌), ఆఫ్గనిస్థాన్‌ రెండు మ్యాచుల్లో 4 పాయింట్ల ( +5.225 నెట్‌ రన్‌ రేట్‌)తో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒకవేళ కివీస్‌ (-2.425) తన చివరి మ్యాచుల్లోనూ గెలిచినా ఆఫ్గన్‌ రన్‌ రేట్‌ ను అధిగమించడం చాలా కష్టం. సో.. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి కివీస్ దాదాపు నిష్క్రమించినట్లే.
T20 World Cup 2024
New Zealand
West Indies
Cricket
Sports News

More Telugu News