Purandeswari: అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదు: పురందేశ్వరి

BJP AP Chief Purandheswari Speech At NDA Meet

  • ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారన్న పురందేశ్వరి  
  • గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని వ్యాఖ్య 
  • కూటమికి అనూహ్య విజయం కట్టబెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి చెప్పారు. అయితే, ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈమేరకు మంగళవారం జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు.

ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు.. కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురందేశ్వరి చెప్పారు. ‘చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కల్యాణ్ శక్తి.. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చింది’ అని చెప్పారు. ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురందేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఐదేళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించకుండా మన కార్యకర్తలను శాంతింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. పురందేశ్వరి బలపరిచారు.

  • Loading...

More Telugu News