Leopard: కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకార వేళ రాష్ట్రపతి భవన్ లో చిరుతపులి...?

Leopard like animal spotted at Rashtrapati Bhavan during NDA oath taking ceremony yesterday
  • ఆదివారం నాడు కొలువుదీరిన ఎన్డీయే 3.0 ప్రభుత్వం
  • మంత్రిగా దుర్గాదాస్ ఉయికే ప్రమాణం చేస్తున్న సమయంలో మెట్లపై జంతువు!
  • వీడియోలో కనిపించిన వైనం
  • సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎన్డీయే 3.0 క్యాబినెట్ నిన్న కేంద్రంలో కొలువు దీరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... నరేంద్ర మోదీతోనూ, ఆయన క్యాబినెట్ సహచరులతోనూ ప్రమాణస్వీకారం చేయించారు. 

అయితే, మంత్రిగా దుర్గాదాస్ ఉయికే ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో వెనుకగా మెట్లపై ఓ చిరుతపులి వంటి జంతువు నడుచుకుంటూ వెళుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దుర్గాదాస్ ఉయికే సంతకం చేసి రాష్ట్రపతి ముర్ము వైపు వస్తుండగా, అదే సమయంలో మెట్ల పైభాగంలో ఓ చిరుతను పోలిన జంతువు దర్శనమిచ్చింది. 

ప్రమాణ స్వీకార వేదికకు కొద్దిదూరంలోనే ఆ జంతువు కనిపించడంతో సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది చిరుత అయ్యుండదని, పెద్ద పిల్లి అయ్యుంటుందని కొందరు వాదిస్తుండగా, రాష్ట్రపతి భవన్ లో చిరుతలు కూడా పెంచుతున్నారా? అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, పీఎంవో షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్ లోనూ ఈ జంతువు కనిపించడంతో, ఇది ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియో అనే వాదనలకు అడ్డుకట్ట పడింది.
Leopard
Rashtrapati Bhavan
Oath Taking Ceremony
NDA 3.0
New Delhi

More Telugu News