Israel: 245 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మహిళకు విముక్తి.. వీడియో ఇదిగో

Israeli Woman Kidnapped By Hamas Freed After 245 Days
  • సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని నుసీరత్‌లో ఐడీఎఫ్ రెస్క్యూ ఆపరేషన్
  • 26 ఏళ్ల నోవా అగ్రమని సహా మరో ముగ్గురిని రక్షించిన దళాలు
  • ఆపై ఆసుపత్రికి తరలింపు
  • 8 నెలల తర్వాత కలిసిన కుమార్తెను చూసి సంతోషంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
హమాస్ చెరలో 245 రోజులుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నిరుడు అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడిన హమాస్ ఉగ్రవాదులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిచేసి ఎంతోమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిలో నోవా అగ్రమని (26), ఆమె బాయ్‌ఫ్రెండ్ అవినాట్ కూడా ఉన్నారు. 

ఉగ్రవాదులు నోవాను బలవంతంగా మోటార్ సైకిల్‌పైకి కూర్చోబెట్టి గాజా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో పెను సంచలనమైంది. నోవా తల్లి అప్పటికే బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. కుమార్తె ఉగ్రవాదుల చెరలో బందీగా ఉందన్న విషయం తెలిసిన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. 

ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం సెంట్రల్ గాజాలోని నుసీరత్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా నోవా సహా మరో ముగ్గురు బందీలను విడిపించింది. అనంతరం నోవాను టెల్ అవీవ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 8 నెలలపాటు వారి చెరలో బందీగా మగ్గిపోయిన నోవా కళ్ల ముందు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Israel
Hamas
Noa Agramani
Israel-Hamas War
IDF

More Telugu News