Ramoji Rao: చనిపోయే వరకు ఆయనకు ఒక్కటే కోరిక: చంద్రబాబు

Chandrababu talks to media after paid tributes Ramoji Rao mortal remains
  • రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
  • రామోజీని యుగపురుషుడు, కారణజన్ముడు అని పేర్కొన్న టీడీపీ అధినేత
  • ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విచారం
  • చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలని కోరుకున్నారని వెల్లడి
హైదరాబాదులో రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక యుగపురుషుడు, ఒక కారణజన్ముడు అయిన రామోజీరావు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. 

"రామోజీరావు నాకు 40 ఏళ్లుగా తెలుసు. ఆయన అనునిత్యం సమాజ హితం కోసం పనిచేశారు. తెలుగు జాతి కోసం పాటుపడ్డారు. రామోజీరావు ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు... వ్యవస్థ. 

మొదట మార్గదర్శి ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు పత్రిక తీసుకువచ్చారు. రాష్ట్రంలోని చాలా ఇళ్లలో నిద్ర లేస్తూనే ఈనాడు పేపర్ చదివితే తప్ప బయటికొచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులను, విజ్ఞానవంతులను చేయడానికి రామోజీరావు కృషి చేశారు. ఆయన నిత్య సాధకుడు. 

నేను మొదట్నించి చూశాను... ఆయన ఏ పని చేసినా కూడా ఎక్కడా రాజీ ధోరణి ఉండదు. నాలుగు దశాబ్దాలుగా ఆయనతో పరిచయం ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు. మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, నేను ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అని స్పష్టం చెప్పిన వ్యక్తి రామోజీరావు. 

అంతేకాదు, చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక. నేను అనునిత్యం పనిచేస్తూ ఉండాలి... చివరి వరకు పనిచేయాలి... పనిచేస్తూనే చనిపోగలిగితే ఆనందంగా ఉంటుంది అని చెప్పేవారు. నేను బతికున్న చివరి క్షణం వరకు ప్రజల కోసం పనిచేయాలని పరితపించిన వ్యక్తి రామోజీరావు. 

ఇవాళ గమనిస్తే, ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఈనాడు శాశ్వతం, ఈటీవీ శాశ్వతం... ఇవే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిలింసిటీని తీసుకువచ్చారు. నేను అనుకుని ఉంటే ఏదో ఒక వాణిజ్య సముదాయం కట్టుకుని ఉండొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు... కానీ నా వల్ల ఈ నగరానికి ప్రయోజనం కలగాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో రామోజీ ఫిలింసిటీ నిర్మించారు. 

తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి రామోజీరావు. అటువంటి మహనీయుడ్ని ఇవాళ పోగొట్టుకున్నాం. అందుకు ఎంతో బాధగా ఉంది. ఏది ఏమైనా ఆయన అందించిన స్ఫూర్తి మిగిలుంది. 

నా జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. నాకు ఏదైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనను సంప్రదించేవాడ్ని. ఆ సమస్య పట్ల ధైర్యం చెప్పేవారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన తన ధర్మాన్ని తాను నిర్వర్తించారు. ఆయన ధర్మం వైపే ఉంటారు... అందుకే రామోజీరావుపై ప్రజల్లో అచంచల విశ్వాసం ఉంది. తన జీవితంలో ఎనలేని విశ్వసనీయతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరం. ఏదేమైనా ఆయన ఆశీస్సులు ఈ తెలుగుజాతికి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధిస్తారు. 

రామోజీరావు చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి రామోజీరావు అందించిన స్ఫూర్తితో ముందుకు పోతాం. 

ఈనాడు పాఠకులకు, ఈటీవీ ప్రేక్షకులకు, రామోజీరావు సంస్థల్లో పనిచేసే సిబ్బంది, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. భగవంతుడు అందించే శక్తితో మళ్లీ రామోజీరావు వారసత్వాన్ని చిరస్థాయిగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Ramoji Rao
Demise
Chandrababu
Eenadu
ETV
Usha Kiran Movies
TDP
Andhra Pradesh

More Telugu News