T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం రుచి చూసిన ఉగాండా

Uganda Claim First Ever T20 World Cup Victory With Win Over PNG
  • పాపువా న్యూగినియాతో లో స్కోరింగ్ మ్యాచ్
  • 77 పరుగులకే ఆలౌట్ అయిన పాపువా న్యూగినియా
  • ఒంటరి పోరాటంతో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన రియాజత్ అలీ షా
అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా జట్టు తొలి విజయం సాధించింది. పాపువా న్యూగినియాతో గయానాలో జరిగిన మ్యాచ్‌లో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని తొలి గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 77 పరుగులకు ఆలౌట్ అయింది. ఉగాండా బౌలర్ల పదునైన బంతులను తట్టుకోలేకపోయిన న్యూగినియా జట్టు బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హిరిహిరి చేసిన 15 పరుగులే అత్యధికం కాగా, లెగా సియాకా, కిప్లిన్ డోరిగా చెరో 12 పరుగులు చేశారు. ఉగాండా బౌలర్లలో నలుగురు బౌలర్లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 78 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 48 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఉగాండా ఆ తర్వాత అతి కష్టం మీద నిలదొక్కుకుని గెలుపు ముంగిట నిలిచింది. వికెట్లు వెంటవెంటనే కోల్పోతున్నా రియాజత్ అలీ షా ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 56 బంతుల్లో 33 పరుగులు చేసి తొలి గెలుపు రుచి చూపించడమే కాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
T20 World Cup 2024
Uganda
Papua New Guinea
Cricket News

More Telugu News