Nimmala Rama Naidu: ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారు: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu slams YCP leaders allegations EVM tampering
  • ఏపీలో టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం
  • ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారంటూ జగన్ మేనమామ ఆరోపణలు
  • 2019లో 151 సీట్లు వచ్చింది ఈ ఈవీఎంలతోనే కదా అంటూ నిమ్మల వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా? అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్? అని నిలదీశారు. 

ఈ ఐదేళ్లలో జరిగిన నిరంకుశ, రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే... దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే... వీళ్లింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. 

"ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి... వీళ్లందరికీ మూలం జగన్ మోహన్ రెడ్డి.  ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ధన దాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదు. 

2004లో ఓ మోస్తరు ఆస్తి కలిగి ఉన్న ఈయన... తండ్రి అధికారంలోకి రాగానే ఒకట్రెండు సంవత్సరాల్లోనే లక్ష కోట్లు ఆర్జించడం... 2019లో ఈయనే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చి శాండ్, లాండ్, మైన్స్ ద్వారా మళ్లీ లక్షల కోట్లు ఆర్జించిన విధానం చూస్తే... ఈయన ప్రజల సేవ కంటే కూడా ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తిగానే కనిపిస్తున్నారు. 

ఈ ఐదేళ్లు తన సన్నిహితులతో చేసిన రాజకీయాలే అతడికి ప్రతికూలంగా మారాయి. ఈ పాలన పట్ల ప్రజలు ఎంతో కసితో ఓటేశారు. నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా లేనంత ప్రభంజనం ఈసారి ఎన్నికల్లో కనిపించింది. కూటమి అభ్యర్థులు వేల ఓట్ల మెజారిటీలతో గెలుపొందారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేం చెప్పడం కాదు... ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారు" అని నిమ్మల రామానాయుడు వివరించారు. 

ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే టీడీపీ గెలిచిందని... సింగపూర్ నుంచి టెక్నికల్ ట్యాంపరింగ్  చేశారని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. బార్ కోడ్ లు ఉపయోగించారని తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు ఓటేశారంటే తాము నమ్మబోమని అన్నారు.
Nimmala Rama Naidu
EVM
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News