ICC: పాక్ జట్టుతో అభిమానుల డిన్నర్ కు రూ. 2 వేల చొప్పున వసూలు!

Pakistan Players Host Private Dinner For USD 25 Before T20 World Cup Get Slammed
  • టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు పాక్ క్రికెట్ బోర్డు వివాదాస్పద నిర్ణయం
  • మీట్ అండ్ గ్రీట్ పేరిట పాక్ ఆటగాళ్లను అభిమానులు కలిసేందుకు ఎంట్రీ ఫీజు వసూలు చేసిన వైనం
  • తప్పుబట్టిన పాక్ మాజీ స్టార్ రషీద్ లతీఫ్.. ఇది దారుణమని విమర్శలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా కెప్టెన్ బాబర్ ఆజమ్ తన సహచరుడు, భారీ పర్సనాలిటీగల వికెట్ కీపర్ ఆజంఖాన్ ను ఉద్దేశించి ‘గెయిండా’ (ఊబకాయులను ఉద్దేశించి ఒక మాండలికంలో పిలిచే పదం) అంటూ పిలిచి బాడీ షేమింగ్ కు పాల్పడటం ఇప్పటికే విమర్శలకు దారితీసింది.

తాజాగా అమెరికాలోని అభిమానులను కలిసేందుకు పాక్ జట్టు ఒక ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసింది. అయితే ఇందులో పాల్గొనే అభిమానుల నుంచి రూ. 2,085 (25 డాలర్లు) ను ఎంట్రీ ఫీజుగా వసూలు చేయడం దుమారం రేపుతోంది. మీట్ అండ్ గ్రీట్ పేరుతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఈ కార్యక్రమంపై స్వదేశంలోని పాక్ అభిమానులతోపాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.

పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ సోషల్ మీడియా ద్వారా తన నిరసన తెలియజేశాడు. ‘లెట్ అజ్ సేవ్ ద స్టార్ అండ్ బీ ద స్టార్స్’ అంటూ క్యాప్షన్ ను తన వీడియోకు జత చేశాడు. వరల్డ్ కప్ ముందు అనధికారిక ప్రైవేట్ డిన్నరా? అంటూ కామెంట్ చేశాడు. 

అలాగే ఈ అంశంపై ఓ టీవీ చానల్ ఆన్ లైన్ చర్చా వేదికలోనూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ‘ఈ టోర్నీలో అధికారిక డిన్నర్ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇదొక ప్రైవేట్ డిన్నర్. ఎవరన్నా ఇలా చేస్తారా? ఇది దారుణం. అంటే అభిమానులు వారు మెచ్చిన ఆటగాళ్లను కలిసేందుకు 25 డాలర్ల చొప్పున చెల్లించారు. ఇంకా నయం.. ఈ కార్యక్రమంలో ఏమైనా గందరగోళం జరిగి ఉంటే జనమంతా ఆ డబ్బును పాక్ ఆటగాళ్లే తీసుకున్నారని అనేవాళ్లు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ కార్యక్రమ వ్యాఖ్యాత నౌమన్ నియాజ్ ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. పాక్ జట్టులో బాధాకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించాడు. అయితే ఓ అభిమాని మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆటగాళ్లతో అభిమానుల డిన్నర్ కు ఎంట్రీ ఫీజును మరింత ఎక్కువగా ఖరారు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ICC
T20 World Cup 2024
Pakistan Cricket Team
Private Dinner
Fans
Entry Fees
Collection
25 USD

More Telugu News