Theif Falls Asleep: చోరీకి వచ్చి నిద్రపోయిన దొంగ.. మర్నాడు ఉదయం అరెస్టు

UP Thief Falls Asleep During Robbery Arrested Next Morning
  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఘటన
  • వైద్యుడి ఇంట చోరీకి వచ్చిన దొంగ
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అన్ని వస్తువులూ దొంగిలించే యత్నం
  • మద్యం మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకున్న వైనం
  • తెల్లారి మెలకువ వచ్చేసరికి చుట్టుముట్టి ఉన్న పోలీసులను చూసి అవాక్కు 
ఉత్తరప్రదేశ్ లో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  లక్నో లోని ఓ వైద్యుడి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో పడి నిద్రపోయి మరుసటి రోజు పోలీసులకు చిక్కాడు. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టర్ - 20లోని ఆ ఇల్లు  సునీల్ పాండే అనే వైద్యుడిది. బలరామ్‌పూర్ ఆసుపత్రిలో పనిచేసే డా.పాండే ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో, ఇల్లు ఖాళీగా ఉంచారు. 

అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి పొరుగింటి వారికి సందేహం కలిగింది. వెళ్లి చూడగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు. సామానంతా చెల్లాచెదురుగా పడి ఉంది. దీంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిద్రలేచిన దొంగ తన చుట్టూ పోలీసులు ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 

నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. తలుపు, కప్ బోర్డులు పగలగొట్టాడని అన్నాడు. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు అక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐపీసీ 379 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Theif Falls Asleep
Uttar Pradesh
Lucknow
Crime News

More Telugu News