Karunas: తమిళ సినీ నటుడి బ్యాగు నిండా బుల్లెట్లే... విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు

Chennai airport authorities questioned actor Karunas after 40 bullets found in his baggage
  • తిరుచ్చి వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన నటుడు కరుణాస్
  • కరుణాస్ బ్యాగులో 40 బుల్లెట్లు
  • వాటికి సంబంధించిన పత్రాలను చూపించిన నటుడు
  • బయల్దేరే హడావిడిలో బ్యాగులో ఏమున్నాయో చూసుకోలేదని వివరణ
  • కరుణాస్ ను ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపిన పోలీసులు
తమిళ సినీ నటుడు కరుణాస్ ఇవాళ చెన్నై ఎయిర్ పోర్టుకు రాగా, ఆయన బ్యాగు తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 40 బుల్లెట్లు బయటపడ్డాయి. 

కరుణాస్ తిరుచ్చి వెళ్లేందుకు ఈ ఉదయం చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో... యథావిధిగానే అధికారులు తనిఖీ చేశారు. ఆయన బ్యాగును స్కానర్ పై ఉంచగా, పేలుడు పదార్థాలు ఉన్నట్టు అలర్ట్ వచ్చింది. వెంటనే ఆ బ్యాగును తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. 

దీనిపై కరుణాస్ ను విమానాశ్రయ అధికారులు ప్రశ్నించారు. తన వద్ద లైసెన్స్ డ్ తుపాకీ ఉందని, ఈ బుల్లెట్లు దానికి సంబంధించినవేనని, తన వద్ద తగిన పత్రాలు ఉన్నాయని కరుణాస్ స్పష్టం చేశారు. తాను ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకు బయల్దేరే హడావిడిలో బ్యాగులో ఏమున్నాయో సరిగా చూసుకోలేదని అధికారులకు వివరణ ఇచ్చారు. 

అయితే ఆ పత్రాలు తనిఖీ చేసిన అధికారులు... కరుణాస్ ను విమానం ఎక్కేందుకు అంగీకరించలేదు. ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు అనుమతించారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని విమానాశ్రయ పోలీసులు వెల్లడించారు. 

కరుణాస్ గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేగానూ ఉన్నారు. తిరువాడనై నియోజకవర్గంలో 2016 నుంచి 2021 వరకు శాసనసభ్యుడిగా కొనసాగారు.
Karunas
Bullets
Baggage
Airport
Chennai
Kollywood
Tamil Nadu

More Telugu News