KCR: కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తె పీజీ వైద్య విద్యకు రూ.24 లక్షలు సాయం అందించిన కేసీఆర్

KCR helps for constable Kishtaiah daughter PG Medical fee
  • 2009లో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య
  • సీఎం అయ్యాక కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్
  • కిష్టయ్య కుమార్తె ఎంబీబీఎస్ విద్యకు సాయం
  • ఇప్పుడు పీజీ వైద్య విద్య అభ్యసించనున్న కిష్టయ్య కుమార్తె
  • మరోసారి ఆర్థిక సాయం చేసిన కేసీఆర్
నాడు 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఆమరణదీక్షకు కూర్చున్న కేసీఆర్ ను అరెస్ట్ చేయగా, ఆ మరుసటి రోజే తెలంగాణ ఉద్యమం కోసం కిష్టయ్య అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మ బలిదానం చేశాడు. కిష్టయ్య మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కులేక అలమటించింది. తన కుమార్తెను డాక్టర్ చేయాలన్నది కానిస్టేబుల్ కిష్టయ్య కల. వైద్య విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఈ నేపథ్యంలో, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక సీఎం అయిన కేసీఆర్... అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకున్నారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక ఎంబీబీఎస్ కు సాయం అందించారు. 

2021లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక... హౌస్ సర్జన్ విద్యను కూడా పూర్తి చేసింది. అనంతరం కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్యురాలిగా విధుల్లో చేరింది. ప్రస్తుతం ఆమెకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం వచ్చింది. 

ఈ క్రమంలో కేసీఆర్ మరోమారు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసానికి వచ్చిన కిష్టయ్య కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించారు. పీజీ వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలో కట్టాల్సిన రూ.24 లక్షల ఫీజు చెక్కును కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులకు అందించారు. తద్వారా కేసీఆర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు, వారితో కలిసి భోజనం చేశారు.

ఇక, కానిస్టేబుల్ కిష్టయ్య కుమారుడు రాహుల్ ఉద్యోగం చేస్తుండగా, ఆ ఉద్యోగం వివరాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
KCR
Constable Kishtaiah
Daughter
PG Medical Course
Fee
Telangana

More Telugu News