KTR: ఆ పదవులకు రాజీనామాలు చేసిన వారిని అభినందించిన కేటీఆర్

KTR praises Ravindar Rao and Gongidi Mahendar Reddy
  • సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్ రెడ్డి
  • పదవులు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి వచ్చినప్పటికీ వారు పదవుల్నే వదిలేశారన్న కేటీఆర్
  • తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని పదవుల్ని గడ్డిపరకల్లా వదిలేశారని కితాబు
రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్ రెడ్డిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పదవులు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి వచ్చినప్పటికీ వారు పదవులనే వదిలేశారన్నారు.

'తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకలా వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో... ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు గారు, గోంగిడి మహేందర్ రెడ్డి గారి నిర్ణయం అభినందనీయం' అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురిచేసినా లొంగకుండా... నమ్మి నడిచిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బాటకే జై కొట్టారన్నారు. తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్‍‌ను రూ.42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్ది, వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారని కితాబునిచ్చారు. టెస్కాబ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని, టెస్కాబ్ అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ గా నిలిచిందన్నారు.

వీరి రాజీనామా, నాయకత్వ లేమి రాష్ట్ర కోపరేటివ్ రంగానికి తీరని లోటు అవుతుందన్నారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
KTR
BRS
Congress

More Telugu News