పోస్టల్ బ్యాలెట్ల అంశంలో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
- పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై వివాదం
- గెజిటెడ్ అధికారం సంతకం ఉంటే, స్టాంపు లేకపోయినా ఫర్వాలేదన్న సీఈవో
- ఇది ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈవో ఈ నెల 25, 27 తేదీల్లో రెండు మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది.
అప్పిరెడ్డి తరఫున అడ్వొకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ఫారం 13-ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ పేర్కొందని... కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈవో మెమోలు జారీ చేశారని ఆరోపించారు.
ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈవో ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జులైలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు, ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వొకేట్ అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.