Ambati Rayudu: అంబ‌టి రాయుడు భార్య, పిల్లలకు కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపులు!

Ambati Rayudu wife and children face death threats from Virat Kohli fans
  • ఆర్‌సీబీ, కోహ్లీపై గ‌త కొన్ని రోజులుగా రాయుడు విమ‌ర్శ‌లు
  • దీంతో రాయుడు ఫ్యామిలినీ బెదిరిస్తూ విరాట్‌ ఫ్యాన్స్ పోస్టులు
  • ఈ విష‌యాన్ని ఇన్‌స్టా వేదిక‌గా తెలియ‌జేసిన రాయుడు ఫ్రెండ్ సామ్ పాల్
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ ఆట‌గాడు అంబటి రాయుడు గ‌త కొన్ని రోజులుగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్‌సీబీ, కోహ్లీ అభిమానులు తాజాగా రాయుడు కుటుంబంపై బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో ఓ కీల‌క మ్యాచులో ఆర్‌సీబీ చేతిలో సీఎస్‌కే ఓట‌మి పాలైంది. ఆ మ్యాచ్‌లో విజ‌యంతో బెంగ‌ళూరు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ త‌ర్వాతి నుంచి రాయుడు ఆర్‌సీబీపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌ల‌కు దిగాడు. 

అంత‌టితో ఆగ‌కుండా ఈసారి టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న కోహ్లీపై కూడా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా.. ఐపీఎల్ ట్రోఫీ గెలవలేరు అని విరాట్‌ను విమర్శించాడు. ఈ కామెంట్స్‌ను బెంగ‌ళూరు, కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌నే అవమానిస్తావా అంటూ రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు స‌మాచారం. అతడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్‌స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో సామ్ చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

"విరాట్‌ కోహ్లీపై రాయుడు చేసిన వ్యాఖ్యలకు గాను కొంత మంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు అభిమానులు రెచ్చిపోయి, అతడి కుటుంబంపై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయుడు భార్య, 1, 4 ఏళ్ల వ‌య‌సు గ‌ల చిన్నారుల‌పై అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. వాటిని కొంత మంది కాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలి" అని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ త‌న ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు. 

ఇదిలాఉంటే.. రాయుడు కుటుంబంపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆర్‌సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ తాలూకు పోస్టులు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు క్రికెట్‌లో విమర్శలు సాధారణ విషయమే. అంత మాత్రాన ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేస్తూ బెదిరించడం కరెక్ట్ కాదని కొంత మంది రాయుడికి అండగా నిలుస్తున్నారు.
Ambati Rayudu
Virat Kohli
Royal Challengers Bengaluru
Chennai Super Kings
Cricket
Sports News
IPL 2024

More Telugu News