Coastal Road Tunnel: భారత్‌లో తొలి సముద్ర సొరంగ మార్గంలో నీరు లీక్!

Seepage In Mumbais Undersea Coastal Road Tunnel 2 Months After Opening
  • ముంబైలోని కోస్టల్ రోడ్ టన్నల్ గోడల నుంచి కారుతున్న నీరు
  • టన్నెల్ ప్రారంభమైన మూడో నెలలోనే సమస్యలు
  • ప్రత్యేక సాంకేతికతతో గోడల్లోని పగుళ్లను నింపుతామన్న మహారాష్ట్ర సీఎం
  • ఇది శాశ్వత పరిస్కారమని వెల్లడి
ముంబైలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగమార్గం కోస్టల్ రోడ్ టన్నల్ లో నీరు లీకవడం సంచలనంగా మారింది. మూడు నెలల క్రితమే దీన్ని ప్రారంభించారు. ఇంతలోనే గోడల నుంచి నీళ్లు లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లీక్‌కు కారణమేంటో తెలియరాలేదు. అధికారులు ప్రస్తుతం దీని వెనకున్న కారణాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

నీరు లీకవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే సందర్శించారు. ‘‘నేను వెంటనే కమిషనర్ కు ఫోన్ చేశాను. రెండు మూడు చోట్ల నీరు లీకవుతోంది. ఈ విషయమై అధికారులు నిపుణులతో మాట్లాడారు. సొరంగాలకు వచ్చిన ముప్పేమీ లేదని వారు భరోసా ఇచ్చారు’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రత్యేక సాంకేతికత ద్వారా సొరంగం గోడల్లోని ఖాళీలను నింపేస్తామని సీఎం చెప్పారు. వానాకాలంలో కూడా నీరు లీకయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇది సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. 

1967 నాటి నగర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ సముద్ర సొరంగాన్ని ప్లాన్ చేశారు. ఇటీవలే సొరంగం మార్గం మొదటి దశను సీఎం ఏక్ నాథ్ శిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రారంభించారు. రెండో దశ జూన్ 10న ప్రారంభించనున్నారు. 2.07 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం గిర్‌గావ్ నుంచి బ్రీచ్ కాండీ బీచ్ వరకూ సముద్రం అడుగున నిర్మించారు. ఈ సొరంగం కారణంగా ప్రయాణ సమయం 45 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గింది. మొత్తం రెండు సొరంగాలు సిద్ధం చేయగా ఒకటి ప్రస్తుతం వినియోగంలో ఉంది. 12.19 మీటర్ల వ్యాసం ఉన్న ఈ సొరంగాలను నీటి ఉపరితలానికి 12 నుంచి 20 మీటర్ల లోతున నిర్మించారు. దేశంలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగ మార్గంగా ఈ మార్గం అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.
Coastal Road Tunnel
Seepage
Mumbai
Maharashtra

More Telugu News