Revanth Reddy: ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు: బీఆర్ఎస్ నేతలు

BRS leaders no one can erase kakatiya history from telangana
  • రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన వద్దిరాజు రవిచంద్ర, తాతామధు
  • తెలంగాణ చరిత్ర నుంచి కాకతీయులను, నవాబులను ఎవరూ చెరపలేరని వెల్లడి
  • కేసీఆర్ ఆనవాళ్లను కూడా చెరపడం ఎవరి వల్లా కాదన్న బీఆర్ఎస్ నేతలు
నాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి చరిత్ర తెలంగాణ బిడ్డలందరికీ తెలుసునని... అసలు ఉద్యమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటో చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు నిలదీశారు. మంగళవారం వారు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ చరిత్ర నుంచి కాకతీయులను, నవాబులను ఎవరూ చెరపలేరన్నారు.

తెలంగాణలో నేడు చెరువుల ఫలాలు పొందుతున్నామంటే అది కాకతీయుల గొప్పతనమే అన్నారు. హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత నవాబులదే అన్నారు. కాకతీయులు, నిజాం నవాబులు తెలంగాణలో చేసిన అభివృద్ధిని, వారి గుర్తులను చెరిపివేయాలని ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులను... చారిత్రక కట్టడాలను చూస్తే కాకతీయులు, నవాబులే గుర్తుకు వస్తారన్నారు.

కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని స్పష్టం చేశారు. అలాంటి కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం కూడా ఎవరి వల్లా కాదన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్‌ను... ఏదో చేయాలనే ప్రయత్నాలు రైఫిల్ రెడ్డి ఆపేస్తే మంచిదని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ చరిత్ర సుస్థిరంగా ఉంటుందన్నారు.
Revanth Reddy
BRS

More Telugu News