AP High Court: మరో మూడు కేసుల్లోనూ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ముందస్తు బెయిల్

AP High Court grants anticipatory bail to ycp mla pinnelli in three more cases
  • జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
  • ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం
మాచర్ల నియోజకవర్గ అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ లభించింది. ఈ నెల 13న పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. 

అయితే ఆ తర్వాత రోజు జరిగిన దాడులు, బాధితులను బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు రెండు కేసులు పెట్టారు. అలాగే ఓ సీఐపై జరిగిన దాడి కేసులోనూ ఆయన పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చారు. దీంతో ఈ మూడు కేసుల్లోనూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం.. మంగళవారం తీర్పు వెలువరించింది.

జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ విధించిన షరతులే ఈ కేసులకూ వర్తిస్తాయని తెలిపింది. కేసుల తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

అంతకుముందు.. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ కేసుల్లో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి అనే ఫిర్యాదుదారుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. 

ఉత్తర్వులు వెలువరించే ముందు పిన్నెల్లి గత చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్‌ రోజున పిన్నెల్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేలా అనుమతించరాదని.. అది శ్రేయస్కరం కాదని వాదించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఈ కేసుల్లో పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి.. ఆ మర్నాడు అనుచరులతో ర్యాలీ నిర్వహించి ప్రతిపక్ష నేతలను బెదిరించారని ఆరోపించారు. అలాగే పోలీసులను గాయపరిచారని చెప్పారు. ఇప్పటి వరకు 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడని పేర్కొన్నారు. పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండాలన్న కోర్టు ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు మంగళవారం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP High Court
Anticipatory Bail
YSRCP
MLA
Pinnelli Ramakrishna Reddy

More Telugu News