Phone Tapping Case: ఎన్నికల సమయంలో బీజేపీ నేత వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడి ఫోన్లపై నిఘా!

Bhujinga Rao revealed many facts in phone tapping case
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు
  • ప్రణీత్ రావు సహకారంతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెల్లడి
  • కాంగ్రెస్, బీజేపీలకు ఆర్థికంగా సహాయపడేవారి ఫోన్లను ట్యాపింగ్ చేశామన్న భుజంగరావు
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాపింగ్ చేశామని ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. మరోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా పని చేసినట్లు చెప్పారు. బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిలపై నిఘా పెట్టామన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాఫ్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఆర్థికంగా సహాయపడేవారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు. అలాగే పార్టీలో ఉంటూ వ్యతిరేక గళం వినిపించేవారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేశామని, విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేశామన్నారు.

వాహనాలను కూడా ట్రాక్ చేసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికల సమయాలలోనూ ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్మెంట్లు చేసినట్లు అంగీకరించారు.

రెండు ప్రయివేటు ఆసుపత్రుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించామని... బీఆర్ఎస్ నేతల సహకారంతో టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లినట్లు చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావుతో ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసేలా చేశామని... లేదంటే కేసులతో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించామన్నారు. పేపర్ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు.
Phone Tapping Case
BRS
Congress
BJP
Revanth Reddy
Venkataramana Reddy

More Telugu News