Indonesia Marriage: అమ్మాయిలా నటించి అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఇండోనేషియా యువకుడు.. 12 రోజుల తర్వాత బయటపడ్డ మోసం

Indonesian Man Discovers His Wife Is Actually A Man After 12 Days Of Marriage
  • సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై ప్రేమించి పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు
  • పెళ్లికి ముందు, తర్వాత కూడా మేలి ముసుగు తీయని యువతి
  • సంప్రదాయం పాటిస్తోందని అనుకుని మురిసిపోయిన భర్త
  • రోజులు గడుస్తున్నా దగ్గరికి రాకపోవడంతో అనుమానం.. ఆరా తీయడంతో బయటపడ్డ మోసం
సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత షాక్ తగిలింది. అప్పటి వరకూ అమ్మాయిలా హొయలు పోయిన మనిషి అసలు అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. ఆపై పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతం వివరాలు..

ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఇద్దరూ ఓ హోటల్ లో కలుసుకున్నారు. బురఖాతో హాజరైన అడిండాను చూసి సంప్రదాయం పాటిస్తోందని మురిసిపోయాడు. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. సంతోషంగా ఒప్పుకున్న అడిండా.. తనకు నా అనేవాళ్లు లేరని, ఒంటరినని చెప్పింది. దీంతో తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఏకే ఈ నెల 12న ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.

వివాహం జరిగిన తర్వాత కూడా అడిండా బురఖా తీయలేదు. నిత్యం బురఖాలోనే ఉండడం, తన ఇంట్లో వాళ్లతో దూరంగా మసలడంతో అనుమానం వచ్చినా కొత్త పెళ్లికూతురు సిగ్గుపడుతోందని ఏకే భావించాడు. తనకు పీరియడ్స్ అని చెప్పి అడిండా భర్తను కూడా దూరంపెట్టింది. రోజులు గడిచినా రాత్రిపూట దూరంగా ఉండడంతో అనుమానించిన ఏకే.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అడిండా అసలు అమ్మాయే కాదని, అమ్మాయిలా నటించిన అబ్బాయని తేలింది. అడిండా అసలు పేరు ఈష్ అని, అతడి తల్లిదండ్రులు నిక్షేపంలా బతికే ఉన్నారని బయటపడింది.

2020 నుంచి అడిండా క్రాస్ డ్రెస్సింగ్ (అమ్మాయిలా డ్రెస్సింగ్ చేసుకోవడం) చేస్తున్నాడని ఏకే తెలుసుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. అడిండా చూడ్డానికి అమ్మాయిలా కనిపించడం, గొంతు కూడా అమ్మాయిలాగే ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు చెప్పారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే.. ఏకే ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనేనని అడిండా జవాబిచ్చాడట. కాగా, అడిండా చేసిన మోసానికి ఇండోనేషియా చట్టాల ప్రకారం నాలుగేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Indonesia Marriage
Man poses as women
marriage cheating
Offbeat
Social Media

More Telugu News